183 total views, 1 views today
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ హీరోగా కొన్నేళ్ల క్రితం చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఒక మారుమూల పల్లెటూరిలో సుభ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఎంతో విలువైనదని తెలుసుకుని, కొందరు నీచులు దానిని చేజిక్కించుకోవడానికి ఒక కల్పిత కథను సృష్టించి పన్నిన పన్నాగాన్ని హీరో తెలివిగా పసిగట్టి ఛేదిస్తాడు. అప్పట్లో రిలీజ్ అయిన ఆ సినిమా హిట్ సాధించడం జరిగింది. కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో తనికెళ్ళ భరణి, తులసి, రావు రమేష్, రాజా రవీంద్ర, సత్య ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న కార్తికేయ 2 సినిమా యొక్క కాన్సెప్ట్ వీడియోని నేడు రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 5118 సంవత్సరాల క్రితం జరిగిన యుగాంతం సమయంలో ఎంతో విలువైన జ్ఞాన సంపద కూడా దానితో పాటు మాయమవుతుంది. అయితే దానియొక్క గొప్పతనాన్ని గుర్తించిన కొందరు దుండగులు ఈ యుగంలో దానిని దక్కించుకోవడానికి పన్నిన పన్నాగాన్ని హీరో ఏ విధంగా పసిగట్టాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు ఆ వీడియోని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. కాగా రేపటి నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి, అతి త్వరలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది యూనిట్……!!