124 total views, 1 views today
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోందని, అలానే సినిమాలోని ఒక కీలక పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారని కొద్దిరోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నిన్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓ పిట్ట కథ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మెగాస్టార్,
మాటల సందర్భంలో ఒక్కసారిగా తాను కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పేరు ఆచార్య అంటూ బయటపెట్టడం జరిగింది. ఇక మెగాస్టార్ ఆ పేరు చెప్పగానే వేదిక సహా అభిమానులందరూ ఈలలు, గోలలతో హోరెత్తించారు. అయితే మాటల సందర్భంలో అనుకోకుండా సినిమా పేరు బయటపెట్టవలసి వచ్చిందని, సారీ కొరటాల అంటూ మెగాస్టార్ మాట్లాడుతూ చెప్పారు. దీనితో ఆయన సినిమా టైటిల్ ఆచార్య అని అందరికీ తెలిసిపోయింది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది….!!